తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవ అవగాహన కార్యక్రమం

తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవ అవగాహన కార్యక్రమం

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్

తేదీ: 21-02-2024

అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ అవగాహనా కార్యక్రమం

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోగల జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల, కొండాపూర్ లో విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య P. వారిజారాణి గారు (తెలుగు శాఖ, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం) విచ్చేశారు. ఈ అవగాహన కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్లె అనంత్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి ఆచార్య P. వారిజారాణి గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ”నీతి, నిజాయితీ, మంచి నడవడిక నేర్పేది మాతృభాష. తల్లి భాషలేనిదే మానవజాతికి వికాసం లేదు. అన్య భాషలు ఎన్ని నేర్చుకున్నప్పటికి మాతృభాషలో ప్రావీణ్యుడు కాలేనివాడు విజ్ఞాన సముపార్జన చేయలేడు. అలాంటి తల్లి భాష నేడు తల్లడిల్లుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వేలకొలది మాతృభాషలు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయంటూ యునెస్కో(UNESCO) హెచ్చరిస్తుంది. ఆంగ్ల భాష అనే రోడ్ రోలర్ క్రింద పడి ఇప్పటికే మాతృభాషలెన్నో నలిగి కనుమరుగై పోయాయని యునెస్కో సర్వే తేల్చింది. మాతృభాషలను పరిరక్షించుకోవడానికి యునెస్కో వారు 1999 ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించి ప్రతి సంవత్సరం ఒక నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం నినాదం ‘బహుభాషా విద్య అనేది తరతరాల అభ్యాసానికి మూలస్తంభం’. ప్రపంచ వ్యాప్తంగా వేల స్థానిక భాషలు ఉన్నా, కొన్ని వందల భాషలకే విద్యా వ్యవస్థలో చోటు దక్కింది. ఈ రోజునే మాతృభాషా దినోత్సవంగా ఎన్నుకోవడానికి ప్రధాన కారణం, బంగ్లాదేశ్ లో తమ మాతృభాష అయిన బెంగాలీకి గుర్తింపు ఇవ్వాలని ఉద్యమించిన మాతృభాషాభిమానుల్లో నలుగురు బలి అవ్వడం జరిగింది. వారి జ్ఞాపకార్ధం యునెస్కో వారు ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. స్వభాషలో విద్య ఉంటే స్వరాజ్యం ఎప్పుడో వచ్చేదని గాంధీజీ 1938లోనే చెప్పారు. మొదట నేర్చుకొనే మాతృభాషను ఇష్టపూర్వకంగా పటిష్టంగా నేర్చుకుంటే దాని ద్వారా ఇతర భాషలను కూడా అంత గట్టిగా నేర్చుకోగలరని మెఖంజీ వాకర్, సాదియా శీలన్, కీసర్ ఎట్ ఆల్ లాంటి భాషా పరిశోధకులు ఎనాడో చెప్పారు” అని అన్నారు. ” ఆర్థిక, సాంకేతికాభివృద్ధుల కారణంగా విదేశాలలో అవకాశాలు పెరుగుతూ, విదేశాలలోని అవసరాలు మన దగ్గరకు వస్తూ ప్రస్తుతం ప్రపంచమంతా వసుదైక కుటుంబంలా తయారవుతూ ఒకే భాష, ఒకే సంస్కృతి అన్నట్టుగా మారుతుంది. ప్రపంచీకరణ వలన ప్రపంచమంతా మనకు దగ్గరవుతుండగా మన భాష మాత్రం మనకు దూరమవుతుంది. భాష- సంస్కృతులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. కాబట్టి మారుతున్న మన సంస్కృతితో పాటు మన భాష కూడా మార్పులు చెందుతూ ఉంటుంది” అని అన్నారు.

“జీవితంలో పైకి ఎదగాలంటే ఇతర భాషలు నేర్చుకోక తప్పదు. ఇతర భాషలను నేర్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కాని వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూడటంతో పాటు మన మాతృభాషను పరిరక్షించుకోవాలి” అని అన్నారు. “ఇటీవల కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో మాతృభాషను తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా అభ్యసించే విధంగా చట్టం రూపొందించబడింది. అభివృద్ధి చెందిన దేశాలైన చైనా, జపాన్, కొరియా, జర్మనీ మొదలైన దేశాలు తమ మాతృభాషలోనే విద్యా బోధన కానీ, శాస్త్ర, సాంకేతిక మరియు అన్ని రంగాలలో మాతృభాషనే అనుసరిస్తున్నారు ” అని అన్నారు. “వాటిని ఉదాహరణగా తీసుకుని మన దేశంలో కూడా మాతృభాషలను శాస్త్ర, సాంకేతిక రంగాలలో వినియోగంలోకి తేగలిగితే మన దేశంలోని మాతృభాషలు కూడా సజీవంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ” మనలోని భావాలను ఎదుటివారికి అర్థమయ్యేలా వివరించడానికి సులభంగా ఉంటుంది. భాష సాహిత్య వారసత్వ సంపదకు ఎంతో దోహదం చేస్తుంది. కాబట్టి భాష నశించితే మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మన ఉనికిని కూడా కోల్పోతాం. కావున మన మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిమీదా ఉంది “ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు శ్రీమతి K.నాగలక్ష్మి, పుష్పలీల, S. స్వాతి మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీమతి వాణి సాంబశివరావు, పాలం శ్రీను, జనార్ధన్, శివరామకృష్ణ, అమ్మయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.