6 గ్యారంటీలకు 28నుండి దరఖాస్తులు

6 గ్యారంటీలకు 28నుంచి దరఖాస్తులు

6 గ్యారెంటీలకు 28 నుంచి దరఖాస్తులు

డిసెంబర్19, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్‌ :

కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది.

  • పెన్షన్‌ పెంపు, మహిళలకు రూ.2,500, రూ.500కే గ్యాస్‌, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, కొత్త రేషన్‌కార్డుల జారీ వంటి పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నది. గ్రామసభల ద్వారానే దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ (పీఏసీ)లో తీసుకున్న నిర్ణయాలను పీఏసీ కన్వీనర్‌ షబ్బీర్‌అలీ మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు పలువురు మంత్రులు, సీనియర్‌ నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో ఆరు గ్యారెంటీల అమలు, పార్లమెంట్‌ ఎన్నికలు, టికెట్ల కేటాయింపు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు.
  • నామినేటెడ్‌ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పినట్టు షబ్బీర్‌ అలీ తెలిపారు. గతంలో ఎవరెవరికి హామీ ఇచ్చామో, ఎవరెవరికి ఇవ్వాల్సి ఉంటుందో జాబితా సిద్ధం చేయాలని సీఎం సూచించారని వెల్లడించారు. పదేండ్లపాటు కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలు అధికారానికి దూరంగా ఉన్నారని, ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారని, పోస్టుల భర్తీ ఆలస్యం చేయడం మంచిది కాదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నట్టు సమాచారం. నెల రోజుల్లోనే నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పినట్టు తెలిసింది
  • లోక్‌సభకు పోటీ చేసే పార్టీ అభ్యర్థులను సంక్రాంతి తరువాత ప్రకటిస్తామని రేవంత్‌రెడ్డి చెప్పినట్టు సమాచారం. అసెంబ్లీ అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించామని, ఎంపీ అభ్యర్థుల విషయంలో ఆలా చేయబోమని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ, ఎంపీ టికెట్ల కేటాయింపు వ్యవహారం అధిష్ఠానం చూసుకుంటుందని, తన పాత్ర ఏమీ ఉండదని చెప్పినట్టు సమాచారం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు ఎమ్మెల్సీ, ఎంపీ టికెట్లు దక్కే అవకాశం లేదని, ఈ మేరకు అధిష్ఠానం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నదని అన్నట్టు తెలిసింది.
  • మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్టీ అగ్రనేత సోనియాగాంధీని పోటీ చేయాలని ఆహ్వానిస్తూ పీఏసీలో ఏకగ్రీవ తీర్మానం చేసిట్టు షబ్బీర్‌ అలీ తెలిపారు. ఈ మేరకు సోనియాగాంధీకి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేకు లేఖ రాయనున్నట్టు తెలిపారు. గతంలో ఈ స్థానం నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు
  • ఆర్థిక, నీటిపారుదల, విద్యుత్తు శాఖ, మిషన్‌ భగీరథపై అసెంబ్లీలో చర్చించడంతోపాటు శ్వేతపత్రం విడుదల చేస్తామని షబ్బీర్‌ అలీ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖలో జరిగిన అవకతవకలపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీఏసీ మీటింగ్‌లో వివరించారని చెప్పారు. కాళేశ్వరం కోసం రూ.85-90 వేల కోట్లు ఖర్చు చేసి 90 వేల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేదని ఉత్తమ్‌ చెప్పారని పేర్కొన్నారు. వీటిపై శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల్లో చర్చ పెడుతామని తెలిపారు
  • కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం ప్రకారం ఆరు గ్యారెంటీల అమలులో గ్రామసభలు అత్యంత కీలకం కానున్నాయి. దరఖాస్తుల స్వీకరణతోపాటు లబ్ధిదారుల ఎంపిక కూడా గ్రామసభల ద్వారానే చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించించింది. ఇటు పార్టీ తరుపున, అటు ప్రభుత్వం తరుపున ప్రతినిధులను నియమించి గ్రామ సభలను నిర్వహించనున్నారు. గ్రామసభ ద్వారా దరఖాస్తులు స్వీకరించి, అందరి ఆమోదం తెలిపిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు. దీని పర్యవేక్షణకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నోడల్‌ అధికారిని నియమించనున్నారు. అయితే, పథకాల అమలులో తమ కార్యకర్తలకే తొలి ప్రాధాన్యం ఉంటుందని, ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గతంలోనే చెప్పారని షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. తమ కార్యకర్తల భార్యకు, బామ్మర్దికి, తమ్ముళ్లకు, ఇంటోళ్ల పేర్లు పెట్టి అడ్డగోలుగా తీసుకుంటామంటే నడవదని, నిజమైన అర్హులకే ఇస్తామని తెలిపారు. కొత్త హౌసింగ్‌ శాఖను ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

 

  • ఆరు గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపికకు ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరిస్తామంటూ షబ్బీర్‌ అలీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయానికి సంబంధించినది. దీనిపై ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన ప్రకటన రావాల్సిన అవసరం ఉంటుంది. పెన్షన్‌ పెంపు, మహిళలకు రూ. 2500, రూ. 500కే గ్యాస్‌, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు, కొత్త రేషన్‌కార్డుల జారీ పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తామన్న షబ్బీర్‌అలీ.. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డులు వంటి పథకాలపై ఎటువంటి ప్రకటన చేయలేదు
  • సమావేశంలో పార్లమెంట్‌ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్‌చార్జిలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి రెండేసి నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించగా మిగిలిన వారికి ఒక్కో నియోజకవర్గ బాధ్యతను అప్పగించారు.
  • ఇన్‌చార్జీలు వీరే ….చేవెళ్ల, మహబూబ్‌నగర్‌-రేవంత్‌రెడ్డి, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌-భట్టి విక్రమార, నాగర్‌కర్నూల్‌-జూపల్లి కృష్ణారావు, నల్లగొండ-ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి-కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వరంగల్‌-కొండా సురేఖ, మహబూబాబాద్‌, ఖమ్మం-పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆదిలాబాద్‌-సీతక, పెద్దపల్లి-శ్రీధర్‌బాబు, కరీంనగర్‌-పొన్నం ప్రభాకర్‌, నిజామాబాద్‌-జీవన్‌రెడ్డి, జహీరాబాద్‌-పీ సుదర్శన్‌రెడ్డి, మెదక్‌-దామోదర రాజనర్సింహ, మలాజిగిరి-తుమ్మల నాగేశ్వరరావు.
Leave A Reply

Your email address will not be published.